2008లో కథానిలయం సహాయ సహకారాలతో పత్రికలు, పుస్తకాల డిజిటలైజేషన్ ను మనసు ఫౌండేషన్ ప్రారంభించింది. 2010లో సినిమాలకు సంబంధించిన సమాచార సేకరణ, డిజిటీకరణ మొదలైంది. 2013నుంచి హైదరాబాద్, బెంగళూరు, గుంటూర్లలో స్కానింగ్ సెంటర్లు ఏర్పాటుచేయడం జరిగింది. 2018, మార్చి 18న నెల్లూరు జిల్లా కనియంపాడు గ్రామంలో కారా మాస్టారుగారి చేతుల మీదుగా మనసు ఫౌండేషన్ డిజిటలైజేషన్ సెంటర్ మొదలైంది. అప్పటినుంచి హైదరాబాద్, గుంటూరు, బెంగళూరులలో స్కానింగ్ కార్యక్రమాలు ఆపివేసి కనియంపాడులోనే పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. 2022 అక్టోబరు నాటికి కోటి పేజీల డిజీటీకరణ పూర్తయింది. 2025 నవంబర్ నాటికి 3కోట్ల పేజీల డిజిటీకరణ జరిగింది.
మనసు ఫౌండేషన్ స్కానింగ్ చేస్తున్న వాటిని తెలుగు పుస్తకాలు, పత్రికలు, తాళపత్ర గ్రంథాలు, శాసనాల నకళ్లు, ఆడియోలు, ఫొటోలు, నెగిటివ్స్ ఉన్నాయి.
సినిమాలకు సంబంధించి… సినిమా పత్రికలు, పాటల పుస్తకాలు, సినిమా నెగిటివ్స్, ఫొటోలు, ఆడియోలు, పోస్టర్లు, వివిధ పత్రికల నుంచి సేకరించిన సినిమాల వివరాలు ప్రత్యేకంగా డిజిటీకరణ జరుగుతోంది.
శాసనాల నకళ్లు స్కాన్ చేయడానికి ప్రత్యేక యంత్రాన్ని మనసు ఫౌండేషన్ సొంతంగా రూపొందించుకుంది. తెలంగాణ పురావస్తుశాఖ వద్ద ఉన్న అన్ని శాసనాల నకళ్లను మనసు ఫౌండేషన్ స్కాన్ చేసి వారికి అందజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పురావస్తు శాఖకు సంబంధించిన శాసనాల స్కానింగ్ త్వరలో మొదలవబోతుంది.
ఈ కార్యక్రమం నిరాటంకంగా జరగడానికి ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఎంతోమంది సహకరించారు…సహకరిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా పుస్తకదాతల సహాయసహకారాలకు మనసు ఫౌండేషన్ రుణపడి ఉంటుంది.